తాజా వార్తలు

గంగూలీ 100 మీ. ఛాలెంజ్‌

ఇంగ్లాండ్‌లో ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీకి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన భారత మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్‌లు ఒక సరదా పందెం వేసుకున్నారట. వికెట్ల మధ్య భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి వేగంగా పరుగు తీస్తాడని ఒక మ్యాచ్ సందర్భంగా అభిప్రాయపడిన సెహ్వాగ్.. తన పక్కనే ఉన్న గంగూలీతో ‘దాదా నీకంటే వేగంగా’ అని ఉడికించాడట. దీనికి సరదాగా స్పందించిన గంగూలీ 100 మీ. పరుగు పందెంలో తనతో గెలవమని ఛాలెంజ్ విసిరినట్లు ఇటీవల ఈ డాషింగ్ ఓపెనర్ వెల్లడించాడు.

‘కామెంటరీ బాక్స్‌లో వికెట్ల మధ్య పరుగు గురించి నేను దాదాతో తీవ్రస్థాయిలో చర్చించాను. ఆ సమయంలో విరాట్ కోహ్లి బెస్ట్ రన్నర్‌ అని.. నీ కంటే వేగంగా వికెట్ల మధ్య పరుగు తీస్తాడని దాదాతో చెప్పాను. ఈ కామెంట్‌పై స్పందించిన గంగూలీ సింగిల్స్ తీయడం కంటే.. పరుగు వేగం అందుకోవడం ముఖ్యమని నాతో వాదించాడు. నిరూపించేందుకు జూన్ 20న తనతో 100.మీ పరుగు పందెంలో పోటీపడాల్సిందిగా ఛాలెంజ్ విసిరాడు. అప్పటివరకు ఫిటెనెస్‌ గురించి అంతగా పట్టించుకోని నేను పందెం కోసం కొంచెం కసరత్తు కూడా చేశాను. కానీ.. జూన్ 18న ఛాంపియన్స్ ట్రోఫీ ముగియగా.. 19న టోర్నీ బ్రాడ్‌కాస్టర్ మమ్మల్ని భారత్‌కి పంపించేశారు. దీంతో ఆ పరుగు పందెం వాయిదా పడింది. ఇప్పుడు అవకాశం దొరికితే పోటీపడతా.. నేనైతే 100.మీ రేస్ పూర్తి చేస్తా.. కానీ.. దాదా సంగతి అయితే నాకు తెలియదు’ అంటూ సెహ్వాగ్ చమత్కరించాడు.



Latest News