తాజా వార్తలు

వడ్డీరేట్లు తగ్గించిన ఆర్‌బీఐ..

అందరూ ఊహించినట్లుగానే భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గుడ్‌న్యూస్ అందించింది. రెపో రేటు, రివర్స్ రెపో రేట్లను 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించింది. 6.25 శాతంగా ఉన్న రెపో రేటును 6 శాతానికి, రివర్స్ రెపో రేటును 6 శాతం నుంచి 5.75 శాతానికి తగ్గించారు. ఈ మేరకు బ్యాంకులు కూడా వివిధ రకాల లోన్లకు సంబంధించిన వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలున్నాయి. ఆర్‌బీఐ చివరిసారిగా 2016 అక్టోబర్‌లో వడ్డీరేట్లను తగ్గించడం గమనార్హం.

వడ్డీరేట్లు తగ్గించి 10 నెలలు కావస్తుండటం, ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో.. తాజా మానిటరీ పాలసీలో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలున్నాయని చాలా మంది అంచనా వేశారు. ఆ అంచనాలను నిజం చేస్తూ.. రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా మానిటరీ పాలసీని ప్రకటించింది. మరోవైపు ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాల నుంచి కూడా రెపో రేటు తగ్గింపు అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున డిమాండ్‌ వచ్చింది.

ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ మంగళవారమే (ఆగస్టు 1) ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షను ప్రారంభించింది. సుదీర్ఘ చర్చల అనంతరం కీలక వడ్డీరేటైన రెపో రేటును పావు శాతం తగ్గిస్తున్నట్లు బుధవారం ప్రకటించి మార్కెట్ల వర్గాలకు గుడ్‌న్యూస్‌ అందించింది.



Latest News