తాజా వార్తలు

నేనే రాజు నేనే మంత్రి సినిమా రివ్యూ

కెరీర్లో సోలో హీరోగా భారీ హిట్ లేని రానా, పుష్కర కాలంగా అసలు హిట్ చూడని తేజ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’. తనదైన ప్రేమకథల స్టైల్‌ను పక్కన పెట్టి, ఓ డిఫరెంట్ కథతో తేజ ఈ సినిమా చేశాడు. రానా కూడా ఈ సినిమా తన కెరీర్‌ను మలుపు తిప్పుతుందన్న నమ్మకంతో ఉన్నాడు. బాహుబలి రిలీజ్ తర్వాత రానా నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు బాగా పెరిగాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా..? తేజ మరోసారి దర్శకుడిగా సత్తా చాటాడా..? సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ:
వడ్డీ వ్యాపారం చేసుకుంటూ భార్య రాధ (కాజల్‌) సంతోషమే లోకంగా బతుకుతుంటాడు జోగేంద్ర (రానా). పెళ్లైన మూడేళ్లకు రాధ గర్భవతి కావడంతో జోగేంద్ర ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. గుడిలో కార్తీక దీపం వెలిగించడానికి వెళ్లిన రాధ అనుకోని ప్రమాదానికి గురై గర్భం కోల్పోతోంది. ఆమెకు జీవితాంతం పిల్లలు పుట్టరని డాక్టర్లు చెబుతారు. దానికి కారణమైన ఊరి సర్పంచ్‌‌పై జోగేంద్ర కోపం పెంచుకుంటాడు. రాధ కోరిక మేరకు నాటకీయంగా ఎన్నికల్లో నెగ్గి ఆ ఊరికి అతడే సర్పంచ్‌ అవుతాడు.

ఆ తర్వాత అతడి పనులకు అడ్డు తగులుతున్న స్థానిక ఎమ్మెల్యేపై కూడా పైచేయి సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికవుతాడు. ఎదగడానికి అడ్డొచ్చిన ప్రతి ఒక్కరినీ అంతం చేస్తూ.. చివరికి సీఎం పీఠంపై గురిపెడతాడు. ఇదంతా రాధ కోసమే చేస్తున్నానని భావించే జోగేంద్ర రాజకీయాల్లో పడి ఒకానొక దశలో భార్యను కూడా పక్కన పెట్టే పరిస్థితి వస్తుంది. దీంతో తను కావాలో? సీఎం పీఠం కావాలో? తేల్చుకోమని అడుగుతుంది రాధ. అక్కడి నుంచి జోగేంద్ర ప్రయాణం ఏ వైపు సాగింది? సీఎం కావాలనుకున్న అతని లక్ష్యం నెరవేరిందా లేదా? తదితర విషయాలు తెరపైనే చూడాలి.

విశ్లేషణ:
ఒక సామాన్యమైన వ్యక్తి తలచుకుంటే ఏదైనా సాధించగలడని చూపిస్తూనే.. సమాజంలో ఎదగాలంటే తప్పొప్పులు తప్పవని 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా ద్వారా చెప్పదలుచుకున్నాడు దర్శకుడు తేజ. అతడు జోగేంద్ర పాత్రను డిజైన్ చేసిన తీరును మెచ్చుకోకుండా ఉండలేం. రాజకీయాల్లో సాధారణంగా ఉండే ఎత్తులూ పైఎత్తులను చాలా ఆసక్తి కలిగించేలా తెరపై ఆవిష్కరించాడు. త‌న‌దైన అనుభ‌వాన్నంతా రంగ‌రించి ప్రేక్ష‌కుడు ఒకటి ఊహిస్తే తెర‌పై మ‌రొక‌టి చూపిస్తూ థ్రిల్‌కి గురిచేశాడు. ఆయ‌నలో ఎంత మంచి ద‌ర్శ‌కుడు దాగున్నాడో ఈ సినిమాలో చాలా స‌న్నివేశాలు చాటి చెబుతాయి.

మరోవైపు జోగేంద్ర పాత్రలో రానాను తప్ప మరెవర్నీ ఊహించుకోలేనంత గొప్పగా.. అతడు ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఈ విషయంలో రానాకు పూర్తి మార్కులు పడతాయి. కాజల్ కూడా తన అందంతో ఆకర్షిస్తూనే.. భావోద్వేగాలతో రక్తి కట్టించింది. గ్లామర్ పరంగా కేథరిన్ మంచి మార్కులు కొట్టేసింది. అశుతోష్ రానా, ప్ర‌దీప్‌ రావ‌త్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, స‌త్య‌ప్ర‌కాష్‌, జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి, న‌వదీప్‌, శివాజీ రాజా, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులు త‌మ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు చాలా బాగా న‌టించారు.

సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. అనూప్ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. టైటిల్ సాంగ్‌తోనే అనూప్ ఫుల్ మార్క్స్ సాధించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను మరింతగా ఎలివేట్ చేశాయి. సినిమాటోగ్రఫీ వర్క్ పర్వాలేదనిపించింది. ఎడిటింగ్‌పై మరింత దృష్టి సారించాల్సింది. మొదటి భాగాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించిన దర్శకుడు రెండో భాగాన్ని ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. నెగెటివ్ క్లైమాక్స్ కథకు న్యాయంగానే ఉన్నా.. ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో చెప్పలేం.

మొత్తం మీద తెలుగు ప్రేక్ష‌కులకు కొత్త‌ద‌నాన్ని పంచే ఓ విభిన్న‌మైన క‌థ ఇది. రాజకీయ ఎత్తులను మజా చేసే వారు, వైవిధ్య కథలను ఇష్టపడేవారు తప్పక చూడాల్సిన సినిమా ఇది.Latest News