తాజా వార్తలు

జమ్మూ కశ్మీర్‌లో సరిహద్దుల వెంబడి పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పులకు తెగబడింది.

జమ్మూ కశ్మీర్‌లో సరిహద్దుల వెంబడి పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పులకు తెగబడింది. అత్యాధునిక ఆయుధాలు, మోర్టార్లతో పూంఛ్ జిల్లాలో వాస్తవాధీన రేఖ వెంబడి బీఎస్ఎఫ్ పోస్టులు, గ్రామాలపై దాడిచేసింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు గాయపడినట్టు పోలీసులు తెలిపారు. పాక్ సైన్యం కాల్పులకు స్పందించిన ఆర్మీ ఎదురు కాల్పులు జరిపినట్లు రక్షణ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. లామ్ సెక్టార్‌లో‌నూ కాల్పులకు పాల్పడిందని పేర్కొన్నారు. పూంచ్ సెక్టార్‌లో బుధవారం ఉదయం 8:45 గంటల ప్రాంతంలో మోర్టార్లు, అత్యాధునిక ఆయుధాలతో దాడిచేసిందని, ఈ ఘటనలో ముగ్గురు సైనికులు గాయపడినట్లు పోలీస్ అధికారులు తెలియజేశారు.

పాక్ సైన్యం చర్యలపై ఆర్మీ కూడా ధీటుగా సమాధానం ఇచ్చిందని, కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి అన్నారు. మంగళవారం పూంచ్ సెక్టార్‌లో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అక్టోబరు 2 న జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో పదేళ్ల బాలుడితోపాటు మైనర్ బాలిక ప్రాణాలు కోల్పోగా, 12 మంది గాయపడినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. షాపూర్, కెర్నీ, కస్బా సెక్టార్‌లో ఆర్మీ పోస్టులు, వందలాది మంది గ్రామస్థులను కూడా టార్గెట్ చేసింది. గత కొన్ని నెలలుగా పాకిస్థాన్ సైన్యం సరిహద్దుల్లో ఒప్పందాలను ఉల్లంఘిస్తూ కాల్పులకు తెగబడుతోంది. గతవారం పూంచ్, భింభేర్ గలి సెక్టార్‌లో కాల్పులకు జరిపింది. అలాగే సెప్టెంబరు 24 న పూంచ్ జిల్లా బాలాకోటే సెక్టార్‌పై జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.



Latest News