తాజా వార్తలు

వాళ్లు నిజమైన హీరోలు: పవన్

ఉద్దానం కిడ్నీ సమస్యపై నేనొక్కడినే పోరాటం చేస్తున్నట్లు అందరూ అనుకుంటున్నారని, కానీ దీని వెనుక ఎంతో మంది పేర్లు తెలియని హీరోలు ఉన్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని పోతుల మల్లయ్యపాలెంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన మెడికల్ సింపోజియంలో పవన్ పాల్గొని ప్రసంగించారు. ఉద్దానం కిడ్నీ సమస్యపై పోరాటానికి ఇది తొలి అడుగని పవన్ చెప్పారు. దీన్ని రాజకీయం చేయాలని తాను అనుకోవడం లేదని, తమ తోటి మనషులు బాధను పరిష్కరించాలని తాను అనుకుంటున్నట్లు పవన్ స్పష్టం చేశారు. ఈ సమస్యను రాజకీయాలకు అతీతంగా పరిష్కరించాలని కోరారు.  టీడీపీ ప్రభుత్వానికి సహాపడుతున్నానని చాలా మంది తనను తిడుతూ ఉంటారని, కానీ తాను ప్రజలకు సహాయం చేస్తున్నానే తప్ప ప్రభుత్వానికి కాదని చెప్పారు. ప్రాంతం, కులం, జాతి కోసం పోరాటం చేసిన మనుషులు ఇక్కడ ఉన్నారు కానీ.. మానవత్వం కోసం పోరాటం చేసేవారు లేరని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా నుంచి డాక్టర్ జోసెఫ్ కూడా మానవత్వంతోనే ఇక్కడి వచ్చారని కొనియాడారు. ప్రజలకు సాయం చేయాలన్నదే తన తాపత్రయం అని చెప్పారు. ఉద్దానం కిడ్నీ సమస్యపై మేధావులైన వైద్యులంతా కలసి అధ్యయనం చేశారని, దాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడమే తన పాత్రని వివరించారు.

విమానాశ్రయం నుంచి వస్తున్నప్పుడు దారి పొడుగునా ఫ్లెక్సీలపై ఈ సమస్య కోసం తానే పోరాడుతున్నట్లు ఉందని అది నిజం కాదని అన్నారు. డాక్టర్ కృష్ణమూర్తి, డాక్టర్ దుర్గారావు వంటి పేర్లు తెలియని చాలా మంది నిజమైన హీరోలు ఈ పోరాటం వెనుక ఉన్నారని.. వాళ్లందరికీ తాను మనస్పూర్తిగా సెల్యూట్ చేస్తున్నాని చెప్పారు. ఇలాంటి మేధావులు, అనుభవజ్ఞుల సాయంతో ఉద్దానం సమస్యను పరిష్కరించొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. మనిషి అణుశక్తిని, అణుబాంబుని కనిపెట్టినప్పుడు ఉద్దానం సమస్యకి పరిష్కారం ఎందుకు కనిపెట్టలేడని అని ధైర్యం నింపారు. ఈ సమస్యలన్నిటినీ రేపు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పవన్ చెప్పారు. అవసరమైతే ఈ సమస్యపై జగన్ మోహన్ రెడ్డి మద్దుతు కూడా కోరతానన్నారు.



Latest News