తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ.. ఏఐసీసీ నిర్ణయం

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ.. ఏఐసీసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. అది వేటు ఎంతమాత్రం కాదనీ, ఒకరకంగా ఆ నిర్ణయం ఆయనకు మేలు చేసేదే అని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. పార్టీ అన్నాక కాలానుగుణ మార్పులు తప్పవని, అది పూర్తిగా కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమని వాళ్లంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మధ్య ప్రదేశ్‌లో తిరిగి అధికారం చేజిక్కించుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంపై ప్రధానంగా దృష్టి సారించింది. 2018లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో సర్వశక్తులను పెట్టడానికి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. అంతేకాకుండా.. ఈ బాధ్యతలను దిగ్విజయ్ సింగ్‌కే అప్పగించినట్లు సమాచారం. 

దిగ్విజయ్ ప్రస్తుతం తన సొంత రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాలపై దృష్టి సారించారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో పాదయాత్ర చేయడానికి షెడ్యూల్ కూడా ఖరారు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలను మరో సీనియర్‌ నేత రామచంద్ర కుంతియాకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  దీనికి సంబంధించి దిగ్విజయ్.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇంతకుముందే సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. తనకు బాధ్యతలు పెరిగిన నేపథ్యంలో.. తెలంగాణ పార్టీ వ్యవహారాలపై ఆయా నాయకులు ఎవరికివారే దృష్టి సారించి, అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు ఇక్కడి నేతలు చెబుతున్నారు.Latest News