తాజా వార్తలు

భయపెట్టి రక్త నమూనాలు సేకరించడం లేదు

డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటివరకు విచారణ హాజరైన వారిని భయపెట్టి రక్తనమూనాలు, గోళ్లు, వెంట్రుకలు సేకరించలేదని, వారి ఇష్టప్రకారమే తీసుకోవడం జరిగిందని ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రవదన్ స్పష్టం చేశారు. విచారణకు హాజరైనవారిని భయపెట్టి నమూనాలు సేకరిస్తున్నారంటూ ఆరోపణలు రావడంతో ఆయనతోపాటు అకున్ సబర్వాల్ మీడియా ముందుకొచ్చారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి తమ విచారణ జరుగుతోందని, అధికారుల విచారణా తీరు సరిగా లేదంటూ వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టి పారేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ చార్మి హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. హైకోర్టు ముందు తాము కూడా సాక్ష్యాలు చూపిస్తామని చంద్రవదన్ అన్నారు.

డ్రగ్స్ వ్యవహారంలో ఓ వర్గాన్నే టార్గెట్ చేస్తున్నామనడం సబబు కాదని చంద్రవదన్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అన్ని రంగాలకు చెందిన వారిని విచారిస్తున్నామని, ఇప్పటివరకు 27 మందిని ప్రశ్నించామని, 19 మందిని అరెస్టు చేశామని తెలిపారు. చట్టానికి లోబడే తమ విచారణ సాగగుతోందని, కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. విచారణ నిమిత్తం ఇతర శాఖల అధికారులను కూడా సంప్రదిస్తున్నామని, తమకు లీగల్ టీమ్ కూడా సాయపడుతోందని అన్నారు.



Latest News