తాజా వార్తలు

సాయుధ దళాల రేషన్ అంశంపై కీలక నిర్ణయం!

ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌కు రేషన్ ఇచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందున్న మాదిరిగానే ఈ విధానాన్ని కొనసాగించనున్నట్లు సంకేతాలిచ్చింది. సాయుధ దళాల (ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌)కు ఉచితంగా రేషన్ సదుపాయం కల్పించడం, రేషన్ నిమిత్తం డబ్బులు ఇచ్చే విధానాన్ని నిలిపేయాలని ఏడో వేతన సంఘం సిఫారసు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికే మొగ్గు చూపుతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీంతో డిఫెన్స్ వర్గాలు కొంత కాలంగా ఆందోళన చేస్తున్నాయి. ఈ అంశంపై కొంత మంది అధికారులు కోర్టుకు కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. రేషన్ విధానాన్ని కొనసాగించడానికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

సాయుధ దళాలకు చెందిన సుమారు 43 వేల మంది అధికారులు దీని కింద లబ్ధి పొందుతున్నారు. వీరు దేశానికి అందిస్తున్న సేవలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం.. ఈ విధానాన్ని కొనసాగించడానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీని కింద అందజేసే డబ్బులను ఆయా అధికారుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా ట్రాన్స్‌ఫర్ చేయనున్నారు. అంతేకాకుండా ఈ మొత్తంలో ఎలాంటి హెచ్చుతగ్గులు కూడా ఉండవని అధికారులు చెబుతున్నారు.



Latest News